Pages

ఎందరో మహానుభావులు

Thursday, 25 August 2011

సాహిత్యం - త్యాగరాజఎందరో మహానుభావులు అందరికీ వందనములు ॥

చందురువర్ణుని అందచందమును హృదయారవిందమునజూచి
బ్రహ్మానందమనుభవించువారెందరో మహానుభావులు ॥౧॥

సామగానలోల మనసిజలావణ్య
ధన్యమూర్ధన్యులెందరో మహానుభావులు ॥౨॥

మానసవనచరవరసంచారమునెరిపి మూర్తి బాగుగ
పొగడనేవారెందరో మహానుభావులు ॥౩॥

సరగున పాదములకు స్వాంతమను సరోజమును
సమర్పణము సేయువారెందరో మహానుభావులు ॥౪॥

పతితపావనుడనే పరాత్పరునిగురించి
పరమార్ధమగు నిజమార్గముతోనుబాడుచును సల్లాపముతో
స్వరలయాదిరాగములదెలియువారెందరో మహానుభావులు ॥౫॥

హరిగుణమణిమయసరములు గళమున శోభిల్లు
భక్తకోటులిలలో తెలివితో చెలిమితో కరుణగల్గి
జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువారెందరో మహానుభావులు ॥౬॥

హొయలుమీర నడలుగల్గ్గు సరసుని సదా
కనులజూచుచును పులకశరీరులై
ఆనందపయోధినిమగ్నులై ముదంబునను
యశముగలవారెందరో మహానుభావులు ॥౭॥

పరమభాగవతమౌనివర శశివిభాకర సనకసనందన
దిగీశ సురకింపురుష కనకకశిపుసుత నారద తుంబురు
పవనసూను బాలచంద్రధర శుక సరోజభవ భూసురవరులు
పరమపావనులు ఘనులు శాశ్వతులు
కమలభవసుఖము సదానుభవులుగాక ఎందరో మహానుభావులు ॥౮॥

నీ మేనునామ వైభవంబులను
నీ పరాక్రమధైర్యముల శాంతమానసము
నీవులను వచనసత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్లజేసినట్టి నీమదినెరింగి
సంతసంబునను గుణభజనానందకీర్తనముజేయువారెందరో మహానుభావులు ॥౯॥

భాగవతరామాయణగీతాదిశృతిశాస్త్రపురాణపు మర్మములను
శివాదిషణ్మతముల గూఢములన్
ముప్పదిముక్కోటిసురాంతరంగముల భావంబులనెరిగి
భావరాగలయాదిసౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధిసుఖాత్ములై త్యాగరాజాప్తులైనవారెందరో మహానుభావులు ॥౧౦॥

ప్రేమ ముప్పిరిగొనువేళ నామమునుదలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజదాసులైననవారెందరో మహానుభావులు ॥౧౧॥

0 comments:

Popular Posts